10 సూత్రాల అమలు.. సీఎం చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం

  • స్వర్ణాంధ్ర 2047 విజన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం
  • ప్రణాళికా విభాగంతో కేఆర్ఈఏ వర్సిటీకి చెందిన ఐఎఫ్ఎంఆర్ ఎంఓయూ
  • 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • జీరో పావర్టీ, వాటర్ సెక్యూరిటీ, డీప్ టెక్ మిషన్లపై తొలుత దృష్టి
  • పది సూత్రాల అమలుకు రాష్ట్రస్థాయి కమిటీ, వర్కింగ్ గ్రూపుల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన 'స్వర్ణాంధ్ర 2047 విజన్' అమలులో ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా నిర్దేశించిన పది సూత్రాలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రణాళికా విభాగం, కేఆర్ఈఏ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ (ఐఎఫ్ఎంఆర్) మధ్య సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఎఫ్ఎంఆర్ ప్రతినిధి కపిల్ విశ్వనాధన్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో 15 శాతం వృద్ధిరేటును సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. 2014-19 మధ్య కాలంలో 13.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును (సీఏజీఆర్) సాధించామని, అయితే గత ఐదేళ్లలో వివిధ కారణాల వల్ల అది 11 శాతానికి పరిమితమైందని విశ్లేషించారు. ఇప్పుడు నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ), వృద్ధిరేటు సాధనలో పది సూత్రాల మిషన్ సెల్స్‌ను ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణ బాధ్యతలను ఐఎఫ్ఎంఆర్ చూస్తుంది.

తొలిదశలో జీరో పావర్టీ (పేదరిక నిర్మూలన), వాటర్ సెక్యూరిటీ (జల భద్రత), డీప్ టెక్నాలజీ మిషన్లపై ఐఎఫ్ఎంఆర్ ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, విధానపరమైన సూచనలు అందించడంతో పాటు, వినూత్న పద్ధతులను సిఫారసు చేస్తుంది. ఈ పది సూత్రాల అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం రాష్ట్రస్థాయి కమిటీతో పాటు, మిషన్ వర్కింగ్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయనుంది.

రాష్ట్రంలోని అన్ని రంగాల అభివృద్ధికి డీప్ టెక్‌ను అనుసంధానం చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. ఏఐ స్కిల్లింగ్, డ్రోన్ మ్యాపింగ్, ఆటోమొబైల్, మెటల్స్, స్టీల్, సెమీ కండక్టర్స్, రక్షణ రంగాల్లో కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని గుర్తుచేశారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీలను సైతం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కేఆర్ఈఏ, ఐఎఫ్ఎంఆర్ ప్రతినిధులు, ప్రణాళికా విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Chandrababu Naidu
Swarnandhra 2047 Vision
Andhra Pradesh Government MoU
IFMR KREA University
AP GSDP Growth Rate
Deep Technology Missions

More Telugu News